08 May 2025

Sri Bramarambika Ashtakam in Telugu – శ్రీ భ్రమరాంబిక అష్టకం


Sri Bramarambika Ashtakam in Telugu – శ్రీ భ్రమరాంబిక అష్టకం

 

రవి సుధాకర వహ్ని లోచన రత్న కుండల భూషిణి

ప్రవిమలంబుగా మమ్మునేలిన భక్తజన చింతామణి

అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి

శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా ||1||

 

కలియుగంబున మానవులను కల్పతరువై యుండవా

వెలయు శ్రీగిరి శిఖరమందున విభవమై విలసిల్లవా

ఆలసింపక భక్త వరులకు అష్టసంపద లీయావా

జిలుగు కుంకుమ కాంతిరేకుల శ్రీ గిరి భ్రమరాంబిక ||2||

 

అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్‌

పొంగుచును వరహాల కొంకణ భూముల యందునన్

రంగుగా కర్ణాట మగధ మరాఠ దేశములందునన్

శృంఖలా దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక ||3||

 

అక్షయంబుగా కాశి లోపల అన్నపూర్ణ భవానివై

సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి

మోక్ష మొసగెడు కనక దుర్గవు మూలకారణశక్తివి

శిక్షజేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక ||4||

 

ఉగ్ర లోచన వర వధూమణి యొప్పుగల్గిన భామిని

విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనాకారిణి

అగ్ర పీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణి

శీఘ్రమేకని వరము లిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా ||5||

 

నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ

మిగుల చక్కని పుష్ప కోమలి మీననేత్ర దయానిధీ

జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ

చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా ||6||

 

సోమశేఖర పల్లవారధి సుందరీమణీ ధీమణీ

కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ

నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ

సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా ||7||

 

భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివి

ఖ్యాతిగను శ్రీ శైలమున విఖ్యాతిగా నెలకొంటివి

పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివా

శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీ గిరి భ్రమారాంబికా ||8||

 

ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున

పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకము నందున

తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున

చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీ గిరి భ్రమరాంబికా ||9||

 

తరుణి శ్రీ గిరి మల్లికార్జున దైవరాయల భామినీ

కరుణతో మమ్మేలు యెప్పుడు కల్ప వృక్షము భంగినీ

వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి

సిరులనిచ్చెద వేల్ల కాలము శ్రీ గిరి భ్రమరాంబిక ||10||

 

|| ఇతి శ్రీ భ్రమరాంబిక అష్టకం సమాప్తం ||