Labels

Breaking

Anjaneya Dandakam – ఆంజనేయ దండకం


Anjaneya Dandakam – ఆంజనేయ దండకం

 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేఽహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు నీ నామ సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి, నీ మీద నే దండకం బొక్కటింజేయ నూహించి, నీ మూర్తినిన్ గాంచి, నీ సుందరం బెంచి, నీ దాస దాసుండనై, రామ భక్తుండనై, నిన్ను నే గొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే, వేడుకల్ జేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే, అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిల్చితే, తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై, స్వామి కార్యార్థమై యేగి, శ్రీరామ సౌమిత్రులం జూచి, వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి, యవ్వాలినిన్ జంపి, కాకుత్త్సతిలకున్ దయాదృష్ఠి వీక్షించి, కిష్కిందకేతెంచి, శ్రీరామ కార్యార్ధమై, లంకకే తెంచియున్, లంకిణిన్ జంపియున్, లంకయున్ గాల్చియున్, భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి, శ్రీరాముకున్నిచ్చి, సంతోషనిన్ జేసి, సుగ్రీవుడా యంగదా  జాంబవంతాది వీరాదులన్ గూడి, యాసేతువున్ దాటి, వానరుల్ మూకలై, దైత్యులన్ ద్రుంచగా, రావణుడంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్ వేసి, యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగా నప్పుడే నీవు సంజీవనిన్ దెచ్చి, సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాదులన్వీరులం పోరాడి, చెండాడి, శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా, నంత లోకంబులానందమై యుండ నవ్వేళలందున్, విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముతో జేర్చి , అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్, శ్రీ రామభక్తి ప్రశస్థంబుగా నిన్ను సేవించి నీనామసంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునే వానరాకార! యో భక్తమందార! యో పుణ్యసంచార! యో ధీర! యో వీర! నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి, శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచు నా జిహ్వయందుండియున్  దీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై, శ్రీరామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, బ్రహ్మ తేజంబునన్  రౌద్ర నీ జ్వాల కల్లోల హా వీర హనుమంత! ఓంకార హ్రీంకార శబ్దంబులన్ క్రూర సర్వగ్రహానికమునన్ భూత ప్రేత పిశాచంబులన్, గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి, కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి, రారోరి నాముద్దు నరసింహాయంచున్, దయాదృష్ఠివీక్షించి, నన్నేలు నాస్వామీ! 

యో ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే! వాయుపుత్రా నమస్తే!

 

నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః


జై హనుమాన్! జై హనుమాన్! జై హనుమాన్! 


 

WhatsApp Group Join Now
Telegram Group Join Now